
అమ్మవారి ప్రతిష్ట తగ్గించేందుకే విజయవాడ ఉత్సవ్
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మ వారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దసరా ఉత్సవాల పేరుతో కూటమి నేతలు చేస్తున్న కార్యక్రమాల్లో అమ్మవారిని గుర్తు పెట్టుకుంటారా? మీ సినిమా పాటలు గుర్తు పెట్టుకుంటారా?’ అని ప్రశ్నించారు. విజ యవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. శ్రేయస్ మీడియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో విజయవాడ ఎంపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో వందేళ్లగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. సంక్రాంతి రోజు విజయవాడ ఉత్సవ్ నిర్వహించొచ్చు కదా? అని ప్రశ్నించారు. హిందూ భక్తులను దోచుకోవడానికి సీఎం చంద్రబాబు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు వ్యామోహంతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఉత్సవ్‌కు పర్యటన శాఖ సహకారం, నిధులు ఇస్తోందని కూటమి నేతలు చెప్పటం సిగ్గుచేటన్నారు. బందరు గొడుగుపేట వెంకటేరస్వామికి గొల్లపూడిలో ఉన్న భూముల్లో విజయవాడ ఉత్సవ్ ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. అమ్మవారి దసరా ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు తప్ప, అమ్మవారి దసరా ఉత్సవ్ పత్రికలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
దసరా ఉత్సవాల్లో మిస్ విజయవాడ పోటీలా?
దసరా ఉత్సవాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా జరగాలని కానీ విజయవాడ ఉత్సవ్ పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిస్ విజయవాడ పోటీలు పెట్టడం సిగ్గుచేటని పోతిన మహేష్ విమర్శించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసేలా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ర్యాంప్ వాక్‌లు పెట్టడానికి సిగ్గు, బుద్ధి ఉందా అని మండి పడ్డారు. తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం ప్రాయశ్చితం చేసుకున్న డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గమ్మ ఉత్సవాల పవిత్రను దెబ్బతీసేలా నిర్వ హిస్తున్న విజయవాడ ఉత్సవ్ గురించి ఏమి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారితో పెట్టుకొని దోపిడీ చేయాలంటే పతనం తప్పదని హెచ్చరించారు.