
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు త్వరితగతిన ఇవ్వండి
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో పలు అంశాలపై ఆయన శనివారం విద్యుత్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ డైరెక్టర్ (టెక్నికల్) మురళికృష్ణ యాదవ్‌తో కలసి ఈ సమీక్ష చేశారు. ఈ సంద ర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా సర్కిల్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చి రైతులకు ఇబ్బందిలేకుండా చూడాలని సూచించారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ స్కీం కింద మంజూరయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగదారులకు లో వోల్టేజీ సమస్యను నివారించాలని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగదారులకు విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ సోలార్ సర్వీస్‌లు చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.సత్యానందం, సర్కిల్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, జూని యర్ అకౌంట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.