
సీఐ గోవిందరాజులును వేలు చూపి బెదిరిస్తున్న రావి వెంకటేశ్వరరావు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి బరితెగించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని ప్రధాన రహదారిలో సంబరాల పేరిట నానా హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన పోలీసులపై మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు దౌర్జన్యానికి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..
విశాఖలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించడంతో శుక్రవారం గుడివాడ నెహ్రూచౌక్‌లో టీడీపీ నేతలు బాణసంచా కాల్చుతూ సంబరాలు ప్రారంభించారు. వన్‌టౌన్ సీఐ గోవిందరాజులు, ఎస్‌ఐ గౌతమ్‌కుమార్‌లు తమ సిబ్బందితో నెహ్రూచౌక్ వద్దకు చేరుకుని అనుమతులు లేకుండా రోడ్డుపై ర్యాలీ, బాణసంచా కాల్చడం నిషేధమని, ఇక్కడ నుంచి వెళ్లి పోవాలని రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించి విద్యార్థులకు, వాహనచోదకులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం సరి కాదని వారించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం అంటూ ప్రధాన రహదారిపై సంబరాలు బాణసంచాతో వాహనాదారులకు ఇబ్బందులు అడ్డుకున్న పోలీసులపైనా దౌర్జన్యం అధికారంలోకి వచ్చాక అంతుచూస్తామంటూ బెదిరింపులు
రావి వీరంగం..
బాణసంచా కాల్చడం ఆపాలని కోరిన పోలీసులపై రావి వెంకటేశ్వరరావు దౌర్జన్యం చేశారు. అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, వచ్చేది తమ ప్రభుత్వమని, తాము అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తామని సీఐను వేలు చూపి బెదిరించారు. ఒకానొక దశలో సీఐ, ఎస్‌ఐల ౖపైపెకి వేలుచూపిస్తూ దూసుకొచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది వారించినా రావి, వారి అనుచరులు వెనక్కి తగ్గకుండా ప్రవర్తించారు. రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్సీల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించినా ఆ పార్టీ శ్రేణులు రోడ్డెక్కకుండా పార్టీ కార్యాలయంలోనే విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటే, ఒక చోట తమ అభ్యర్థి విజయం సాధించాడని హంగామా చేయడాన్ని పట్టణ ప్రజలు సైతం తప్పుబట్టారు.