
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన, ధర్నా జరిగింది. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, ఎనిమిది పని గంటలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దోపిడీనే లక్ష్యంగా..
ధర్నాలో పాల్గొన్న ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఈ నాలుగు లేబర్ కోడ్‌లకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లు యథేచ్ఛగా దోపీడీ కొనసాగించడమే కాకుండా కార్మికుల శ్రమను దోచుకునేందుకు కోడ్‌లు తెచ్చిందని మండిపడ్డారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు కనుమరుగవుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. కార్మికుల జీతభత్యాలు సక్రమంగా అందవని, ఉద్యోగాలు తొలగింపు తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించినా, సమ్మె చేసినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
సంక్షోభంలో వ్యవసాయం..
నూతన మార్కెట్ విధానం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. దుర్గారావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీఎల్ నరసింహులు, ఏ వెంకటేశ్వరరావు, ఏ కమల, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బయ్య, కేఆర్ ఆంజనేయులు, ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్, ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, శంకర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్