
కృష్ణా జిల్లాలో 44.3 మి.మీ. సగటు వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 44.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మంగళవారం నమోదైంది. అత్యధికంగా పమిడి ముక్కల మండలంలో 87.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరం మండలంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లోని నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండలంలో 71.8 మిల్లీమీటర్లు, మోపిదేవి 70.2, ఘంటసాల 69.2, పామర్రు 60.6, అవనిగడ్డ 57.4, మచిలీపట్నం 54.2, గుడ్లవల్లేరు 52.6, మొవ్వ, నాగాయలంక 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ మండలంలో 49.4 మిల్లీమీటర్లు, ఉయ్యూరు 48.2, బంటుమిల్లి 46.2, కంకిపాడు 44.2, పెదపారుపూడి 43.2, గూడూరు 36.0, నందివాడ 32.4, కోడూరు 31.2, పెనమలూరు 29.4, పెడన 28.8, తోట్లవల్లూరు 26.6, ఉంగుటూరు 21.4, కృత్తివెన్ను 18.2, బాపులపాడు మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కలెక్టరేట్‌లో కమాండ్
కంట్రోల్ సెంటర్
భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం ఇవ్వండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా 9154 970 454 నంబర్‌తో కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ నంబర్‌లో సంప్రదించి, సమాచారమివ్వాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా, సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, నిరంతరం పరిస్థితిని సమీక్షించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా.. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు అవసరమైన సిబ్బంది, ఇంజిన్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఆదేశాలిచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు.
టంగుటూరి జీవితం స్ఫూర్తిదాయకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేటి తరం యువత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద లోబ్రిడ్జి సమీపంలోని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఆయన 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రకేసరి టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత విశేషాలను వివరించారు. కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చల్ల సుధాకర్, తోపుల వర లక్ష్మి, మాత మహేష్,మురళి కృష్ణంరాజు, గజ్జల కొండ వాసు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలు
రెండో రోజూ ప్రశాంతం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 30 కేంద్రాల్లో నిర్వహించారు. 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 260 మంది పరీక్ష రాశారు. 52.53 శాతం మాత్రమే హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 235 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి మరో 29 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా విద్యాశాఖ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు 28 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు పాత బస్తీలోని సుందరమ్మ వీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆంథోని హైస్కూల్‌తో పాటుగా పలు కేంద్రాలను పరిశీలించారు.

కృష్ణా జిల్లాలో 44.3 మి.మీ. సగటు వర్షపాతం