ఘనంగా ‘స్త్రీ హృదయం’ పుస్తకావిష్కరణ

Volume of stories Stree Hrudayam by PRanga Rao unveiled through online - Sakshi

ప్రముఖ కవి, రచయిత, నటులు, సంగీతకారులు పెయ్యేటి రంగారావు కథల సంపుటి ‘స్త్రీ హృదయం’ను సామవేదం షణ్ముఖ శర్మ ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లో జూమ్ వేదికగా జూలై 16న ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ నరేంద్ర ప్రార్థనా గీతంతో శుభారంభం చేయగా, విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, భారతదేశం నుండి ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సిడ్నీ నుంచి పోతుకూచి మూర్తి అధ్యక్షత వహించారు. 


ప్రారంభ ఉపన్యాసంలో వంశీ రామరాజు మాట్లాడుతూ..‘స్త్రీ హృదయ’ పెట్టడంలో ఇందులోని కథలకున్న ప్రాముఖ్యత తెలుస్తోందన్నారు. ‘పిల్లికి చెలగాటం కథ చదివానని, కథలో భావవ్యక్తీకరణ బాగుందన్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగువారిని ప్రోత్సాహిస్తూ ఉంటానని, భావితరాలకి మన భాష, సంస్కృతి అందటం ముఖ్యమ’ని బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చెట్టిపల్లి అన్నారు. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. రచయిత స్త్రీ హృదయాన్ని లేత అరిటాకులో పెట్టి అందించారు. అంత సున్నితమైనది స్త్రీ హృదయం అన్నారు. రచయిత పెయ్యేటి రంగారావును ‘నవరస కథా సార్వభౌముడు’గా సినీగీత రచయిత భువనచంద్ర  కొనియాడారు. 


సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శోభ వెన్నెలకంటి కథా రచయితకు శుభాకాంక్షలు తెలియచేసారు. సామవేదం షణ్ముఖశర్మ ఆశీస్సులతో నూతన పతాక వేదిక ‘సకల కళాదర్శిని, సిడ్నీ ఆస్ట్రేలియా’ లోగోను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ వేదిక నెలకొల్పటంలో ముఖ్యోద్దేశ్యం సకల కళలకు ఈ వేదిక నిలయంగా కళాకారులని ప్రోత్సహించడమని విజయ గొల్లపూడి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశాన్ని  శ్రీదేవి సోమంచి చదివి వినిపించారు. 


తెలుగు తియ్యదనంతో పాటు జీవిత సత్యాలను ‘స్త్రీ హృదయం’ పుస్తకంలో ఆవిష్కరించారని సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. ఇంకా నూతనంగా వెలసిన ‘సకల కళాదర్శిన’ ద్వారా ఎన్నో మంచి పనులు జరగాలని ఆకాంక్షించారు. కాలిఫోర్నియా నుంచి డా. రవి జంధ్యాల, సినీ రచయిత దివాకర బాబు, హాస్య రచయిత వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సాహితీవేత్త సుధామ, నవలా రచయిత్రి గంటి భానుమతి, రచయిత్రి తమిరిశ జానకి, సిడ్నీ నుంచి విజయ చావలి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సోమంచి సుబ్భలక్ష్మి, శాక్రిమెంటో నుంచి తెలుగు వెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులు వెంకట్ నాగం తదితరులు ఈ పుస్తకావిష్కరణలో పాలుపంచుకున్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top