మంగిపూడి రాధికకు ఊటుకూరి రత్న సుందరి అంతర్జాతీయ సాహిత్య పురస్కారం

Radhika Mangipudi Won Matrushree Ootukoor Ratna Sundari International Literary Award - Sakshi

ప్రపంచ ఖ్యాతి పొందిన రచయిత్రి మంగిపూడి రాధికకు మాతృశ్రీ ఊటుకూరి రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం-2022ను రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బహుకరించింది. సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రధాన నిర్వాహక వర్గం సభ్యురాలిగా, బహుముఖ ప్రజ్ఞతో రచయిత్రిగా కవయిత్రిగా వ్యాఖ్యాతగా నిర్వాహకురాలిగా ఎదుగుతూ, కథలు కవితలు పాటలు వ్యాసాలు పద్యాలు హాస్య రచనలు మొదలైన రచనా ప్రక్రియలలో కథా కవితా సంకలనాలతోపాటు ఇటీవల భారతీయ తత్త్వ శతకాన్ని రచించి పండితుల ప్రశంసలు అందుకున్న మంగిపూడి రాధికను ఈ పురస్కారం 2002 సంవత్సరానికి గాను లభించింది. 

రక్షా పౌండేషన్ నిర్వాహకురాలు, SVBC ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు & సోషల్ మీడియా విభాగాధిపతి, పసుమర్తి రామలక్ష్మి మాట్లాడుతూ "హైదరాబాదు కేంద్రంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ చేతులమీదుగా ప్రారంభమైన తమ సంస్థ ద్వారా ప్రతి ఏడాది కళా సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన ఒక మహిళను ఎంపిక చేసి, తమ మాతృమూర్తి ఊటుకూరి రత్నసుందరి గారి జయంతి సందర్భంగా పురస్కారంతో గౌరవించుకుంటున్నామని, ఇదివరలో డాక్టర్ తెన్నేటి సుధాదేవికి, గత సంవత్సరం సీనియర్ సినీనటి డాక్టర్ రమణారావుకు ఈ పురస్కారాలు అందించామని, ఈ సంవత్సరం సాహిత్య విభాగంలో మంగిపూడి రాధికను ఈ విధంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందని" తెలియజేశారు. 

మాతృశ్రీ ఊటుకూరు రత్నసుందరి గారి 76 వ జయంతి సందర్భంగా 16వ తేదీ ఆదివారం అంతర్జాల వేదిక ద్వారా పలు దేశాల ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని రాధికకు అందజేశారు. తిరుమల స్వామివారి శేషవస్త్రం, పురస్కార జ్ఞాపిక, సన్మానపత్రంతో రాధిక భర్త సాయి ప్రకాష్, కుమార్తె మయూఖ ఆమెను సత్కరించగా, అంతర్జాలం ద్వారా వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేటర్స్ అధ్యక్షులు డా. వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర వంటి పెద్దలు పాల్గొని రాధికకు ఈ పురస్కారం అందడం చాలా సముచితంగా ఉందని, ఆమెకు ఆశీస్సులు అందించారు. 

సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, ఊలపల్లి విద్యాధరి భాస్కర్ దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఆస్ట్రేలియా నుండి తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి,  నార్వే నుండి డాక్టర్ వెంకటపతి తరిగోపుల, యూ. కె నుండి డాక్టర్ జొన్నలగెడ్డ మూర్తి, దక్షిణాఫ్రికా నుండి రాపోలు సీతారామరాజు, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమానికి సింగపూర్ నుండి రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించారు.

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top