మహిళల కోసం.. నారీ స్ఫూర్తి వెబినార్

NariShakti  Webinar On Women Empowerment At Workplace Their Rights And Duties - Sakshi

డాలస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు నారీ స్ఫూర్తి పేరుతో వెబినార్ నిర్వహించింది. తొలుతగా, వెబినార్‌లో రిపబ్లిక్ రాధారాణి వ్యాపార రంగంతో పాటు సేవారంగంలో తాను సాధించిన విజయాలను వివరించారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారితో మమేకం కావడమే తన విజయమని రాధారాణి తెలిపారు.

అలాగే మనం సంపాదించిన దానిలో  సమాజానికి ఎంతో కొంత  ఇవ్వాలనే భావనతో అమ్మ ప్రేమాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ స్టాలన్‌టస్ కంపెనీ నార్త్ అమెరికా అండ్ ఆసియా ఫసిపిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మమత చామర్తి ఈ వెబినార్‌లో తన ప్రస్థానాన్ని వివరించారు. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగం కోసం వచ్చిన మమత ఆటోమొబైల్ రంగంలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన విధానాన్ని వివరించారు. తన శక్తిని మాత్రమే నమ్ముకుని ఆటోమొబైల్ కంపెనీలో చిరుద్యోగిగా మమత తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ దానిని ఆటోమొబైల్ రంగంలో ఎలా వాడొచ్చనే దానిపై చేసిన కృషే తనను ఈ రోజు ఉన్నత స్థానంలో నిలిపాయని మమత చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ మనలోని అంతర్గత శక్తిని అభివృద్ధి చేసుకోవడం పైనే దృష్టి పెట్టాలని ఆమె ఈ వెబినార్‌లో పాల్గొన్న వనితలకు సూచించారు. ఏరంగంలోనైనా సమస్యలు, సవాళ్లు సహజమేనని.. వాటిని ఎదుర్కొవడానికి కావాల్సింది మానసిక శక్తే అనే విషయాన్నిగుర్తు పెట్టుకుని అడుగులు వేయాలని మమత తెలిపారు. సాధించాలనే కసి.. పట్టుదలతో  ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వెయిట్ లిఫ్టర్ కగ్గా శిరోమణి కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.  కృషి.. పట్టుదల.. కఠోర సాధనతో శిరోమణి.. ఇప్పటివరకు వెయిట్ లిప్టింగ్‌లో 136 కు పైగా జాతీయ, అంతర్ జాతీయ పతకాలు సాధించినట్టు శిరోమణి తెలిపారు. ఆడపిల్లలకు ఇలాంటివి ఎందుకు అన్నవారే.. ఇప్పుడు శిరోమణిని చూడండిరా అంటున్నారని ఆమె అన్నారు.

కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో తాను వెయిట్ లిప్టింగ్ లో ముందుకు సాగుతున్నానన్నారు. కామన్ వెల్త్,  ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడమే తన ముందున్న లక్ష్యమని శిరోమణి అన్నారు. అయితే తనకు ఆర్థిక సహకారం అందించే  స్పాన్సర్లు ఉంటే తనలక్ష్యం నేరవేర్చుకోవడం మరింత సులువు అవుతుందని శిరోమణి తెలిపారు. నాట్స్ నారీ స్ఫూర్తి వెబినార్ ‌కు ప్రముఖ రంగస్థల కళాకారిణి రాజేశ్వరీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి, నాట్స్ ఈసీ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, విమెన్ ఎంపవర్‌మెంట్ ఛైర్ జయశ్రీ పెద్దిభొట్ల, ప్రొగ్రామ్ ఛైర్ లక్ష్మి బొజ్జ, చికాగో చాప్టర్ ఛైర్ ప్రసుధ, డాలస్ చాప్టర్ ఛైర్ దీప్తి సూర్యదేవర తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఆన్ లైన్ ద్వారా వందలాది మంది తెలుగు మహిళలు నారీ స్ఫూర్తి ని వీక్షించి స్ఫూర్తిని పొందారు. చివరగా, అరుణ గంటి, జ్యోతి వనం, జయశ్రీ, లక్మి , రాజేశ్వరీలు ఈ కార్యక్రంలో పాల్గొన్న రాధారాణి, మమత మరియు శిరోమణి లను తమ విలువైన సమయాన్ని, నాట్స్ కుటుంబానికి, తద్వారా యావత్ మహిళాలోకానికి తమ తమ అనుభవాలనుపంచి స్ఫూర్తిని నింపినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం అవటానికి తమవంతు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు.

వక్తలు, ప్రేక్షకులు కూడా నేటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాజేశ్వరి ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో క్రీడాస్ఫూర్తితో, భారతదేశ జాతీయ పతాకాన్ని కామన్వెల్త్ , ఒలింపిక్స్ లో  రెపరెపలాడించటానికి మనతోటి తెలుగమ్మాయికి ఆసరాగా ఉండటానికి నాట్స్ తనవంతు సాయంగా ఆన్ లైన్ ద్వారా ఫండ్ రైజ్ కూడా ఏర్పాటు చేసి సహాయం చేస్తోంది. భవిష్యత్తులో కూడా సమాజహితంగా ఉండే  ప్రతి కార్యక్రమానికి తమ వంతు సాయం చేస్తామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే తెలియచేస్తూ,  నాట్స్ విమెన్ టీమ్‌ను ప్రత్యేకంగా  అభినందించారు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top