ఎయిర్‌పోర్టులో కోవిడ్‌ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది?

Rapid PCR Test Cost And Result Time Details  - Sakshi

Rapid PCR Test Cost And Result Time Details at Hyderabad Chennai Airport: ఒమిక్రాన్‌ వేరియింట్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. బుధవారం నుంచి హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ రకమైన పరీక్షలు చేస్తున్నారు ? రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుందనే అంశాల పట్ల  ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌ ఎదురు చూస్తు‍న్నారు.

రోజుకు 5000ల మంది
హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ద్వారా దేశంలోని వివిధ నగరాలు, విదేశాల నుంచి నిత్యం 5000ల మంది ప్రయాణికులు రాష్ట్రంలోకి వస్తున్నారు. వీరిలో కేంద్రం పేర్కొన్న అట్‌ రిస్క్‌ జాబితాలో ఉన్న 12 దేశాల నుంచి ఇంచుమించు 500ల మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ప్రభుత్వం ఏ‍ర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కి పంపిస్తున్నారు. 

రెండు నుంచి ఆరు గంటలు
ప్రస్తుతం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు సుమారు 6 గంటల సమయం పడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే ర్యాపిడ్‌ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష రిజల్ట్‌ రెండు గంటలలోపు వస్తుంది. ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ ధర రూ.999 ఉండగా ర్యాపిడ్‌ కిట్‌ ధర రూ.4,500లుగా ఉంది.

టిమ్స్‌కి
ఎయిర్‌ పోర్టు ప్రాంగణంలో కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడంతో పాటు రిజల్ట్‌ వచ్చే వరకు ఎదురు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 400ల మందికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టులో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అక్కడ హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 

చెన్నైలో
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు విదేశీ ప్రయాణాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌ తర్వాత ఎక్కుగా చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను ఉపయోగించుకుంటారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కి రూ.700 ఛార్జ్‌ చేస్తుండగా రిజల్ట్‌ కోసం ఆరు గంటల సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ర్యాపిడ్‌ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కి రూ.3500 ఛార్జ్‌ చేస్తుండగా 30 నిమిషాల నుంచి రెండు గంటలలోపు రిజల్ట్‌ అందిస్తున్నారు. 

చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top