యథావిధిగా ప్రైవేట్‌ స్కూళ్ల దందా | - | Sakshi
Sakshi News home page

యథావిధిగా ప్రైవేట్‌ స్కూళ్ల దందా

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

వ్యాపారంగా మార్చారు

కఠినంగా అమలు చేయాలి

ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నాం

ఆర్మూర్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఆగడాలను నియంత్రిస్తూ ప్రభుత్వాలు తీసుకొస్తున్న నిబంధనలు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. విద్యాలయాల ముసుగులో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల అమ్మకాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. తల్లిదండ్రులకు ఎంపిక స్వేచ్ఛ ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే బుక్‌ స్టాల్స్‌, యూనిఫామ్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంస్థల ధన దాహానికి విద్యాశాఖ అధికారుల మౌనం తోడు కావడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయాల్సిన దుస్థితి నెలకొంది. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో నెలకొల్పిన ప్రధాన కార్పొరేట్‌ పాఠశాలల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు రోజుల నుంచే పాఠశాలల స్టోర్ల వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని ఎండగడుతూ పలు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు, ఫిర్యాదులు చేసినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇస్తున్న పాఠ్య పుస్తకాల కోసం ప్రైవేట్‌ స్కూళ్లలో రూ.5,000 రూ.12,000 వరకు ఖర్చవుతోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు పిల్లల చదువు భారమేనని విద్యా హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కనిపించని పర్యవేక్షణ

పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పుస్తకాలు, యూనిఫామ్‌ వ్యాపారం చేయొద్దని జీవో నంబర్‌ 01 (01 – 01 – 1994) స్పష్టం చేస్తోంది.

పుస్తకాలు, యూనిఫామ్‌ ఎక్కడ కొనాలో నిర్ణయించుకునే హక్కు పిల్లల తల్లిదండ్రులకే ఉంటుందని 2017లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం. గత విద్యా సంవత్సరంలో అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకంపై డీఈవో కార్యాలయానికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందగా, రెండు, మూడు పాఠశాలలకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. సీజ్‌, గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు ఇప్పటివరకు లేవు.

తల్లిదండ్రులు చెబుతున్న సమస్యలు

ఎన్‌సీఈఆర్టీ, ఎస్‌సీఈఆర్టీ సిలబస్‌కు అదనంగా ప్రైవేట్‌ పబ్లిషర్ల పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ కొనాలని ఒత్తిడి పెట్టడంతో ఒకటో తరగతి చదివే ఒక్కో విద్యార్థిపై రూ.5,000 నుంచి రూ.7,500 అదనపు భారం పడుతోంది. పాఠశాల సూచించిన షాపులోనే యూనిఫాం, షూ, టై, బెల్ట్‌, బ్యాగ్‌ కొనాలని నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బయట మార్కెట్‌ కన్నా 30 నుంచి 40 శాతం ధరలు అధికంగా ఉంటున్నాయి. డిజిటల్‌ లెర్నింగ్‌ యాప్‌, స్టడీ మెటీరియల్‌ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బ్యాచ్‌ల పేరుతో ర్యాంకర్స్‌ బ్యాచ్‌, ఒలంపియాడ్‌, ఐఐటీ ఫౌండేషన్‌ పేరుతో సాధారణ ఫీజుకు రెండు నుంచి మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.

కాగితాలకే పరిమితమైన నిబంధనలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న

అధికారులు

విద్యావ్యాపారాన్ని నియంత్రించాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయి. నియంత్రణ లేని అధిక ఫీజులను వసూలు చేయడమే కాకుండా వారి వద్దనే నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు కొనుగోలు చేయాలనడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది.

– గటాడి రాజు, హుస్నాబాద్‌ కాలనీ, ఆర్మూర్‌

ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న వ్యాపారాన్ని నియంత్రించడానికి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వారు ఫిర్యాదులు వచ్చినపుడే స్పందించి తరువాత తమకు పట్టనట్లుగా వ్యవహరించడం తగదు.

– నరేందర్‌, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ, నిజామాబాద్‌

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో వ్యాపారం నిర్వహించడంపై ఫిర్యాదులు వచ్చినపుడల్లా ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడాన్ని అధికారులు సహించరు.

– అశోక్‌, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement