నందిపేట్(ఆర్మూర్): పూజ చేసిన పూలను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన పిస్క గంగాచరణ్ భార్య సుజాత బుధవారం ఉదయం 11 గంటలకు పూజ అనంతరం తీసేసిన పూలను నీటిలో వేసేందుకు రఘునాథ చెరువుకు వెళ్లింది. వైన్‌షాపులో పని చేసే గంగాచరణ్ మధ్యాహ్నం వేళ భోజనానికి ఇంటికి రాగా భార్య కనిపించలేదు. చుట్టు పక్కల వెతకగా చెరువులో మృతదేహం కనిపించింది. పూలను నీటిలో వేస్తుండగా కాలుజారి పడిపోయి ఉంటుందని గంగాచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఈత రాక ఒకరు..
ఆర్మూర్‌టౌన్: చెరువులో స్నానానికి వెళ్లిన ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన గణేశ్ (39) నీట మునిగి మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. మచ్చర్ల గ్రామంలో గణేశ్ గొర్రెలను మేపుతూ చెరువు వద్దకు వెళ్లాడు. స్నానానికి దిగిన గణేశ్ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గణేశ్ భార్య చంద్రకళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ట్రాక్టర్ ఢీకొని మరొకరు..
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ సల్మాన్(30) అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. సల్మాన్ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఉండగా అటు వైపు అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ గుంతలో పడి పక్కనే ఉన్న సల్మాన్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు.


