● మోడల్ స్కూల్ విద్యార్థుల
తల్లిదండ్రుల వినతి
డిచ్‌పల్లి: ‘మీ పాఠశాలకు బస్సు సౌకర్యం లేదు.. పిల్లలకు టీసీలు ఇస్తే మా ఊరిలోనే చదివించుకుంటాం’ అని డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిచ్‌పల్లి మోడల్ స్కూల్‌లో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత డిచ్‌పల్లి మండలంలోని ఆర్మూర్ రూట్‌లో ఉన్న గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి పాఠశాల ప్రిన్సిపాల్‌ను టీసీల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 40 మందికి పైగా టీసీల కోసం వినతిపత్రాలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆర్మూర్ నుంచి ఇందల్వాయికి రెగ్యులర్‌గా బస్సు సౌకర్యం ఉండేది. ఈ బస్సులో పలు గ్రామాల విద్యార్థులు మోడల్ స్కూల్‌కు రాకపోకలు సాగించేవారు. ఇటీవల బస్సు సర్వీసును రద్దు చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీసీల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దశరథ్ మాట్లాడుతూ.. కొన్ని గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్న మాట వాస్తవమేనని, పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.


