● అవకతవకలకు తావులేదు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఆన్‌లైన్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో పంటల సాగు కోసం 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అంచనా వేయగా, 38,766 మెట్రిక్ టన్నుల నిల్వలు వచ్చాయని వివరించారు. ఇప్పటి వరకు 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను యాప్ ద్వారా 1,46,393 మంది రైతులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి 13,995 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అమ్మకం జరిగిందని, ప్రస్తుతం 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామన్నారు. జిల్లాలో ఇంకా 17,695 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దని, సొసైటీలు, ప్రయివేటు డీలర్లతోపాటు జిల్లాలోని 106 రైతు వేదికల ద్వారా ఎరువుల విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.


