● సమగ్ర శిక్షలో సీజీవీల శ్రమ దోపిడీ
● ఉమ్మడి జిల్లాలో విధులు
నిర్వహిస్తున్న 46 మంది
రూ.108 వేతనం
ఆర్మూర్: సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న భవిత కేంద్రాల్లో కిందిస్థాయి ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కేర్ గివింగ్ వలంటీర్ (ఆయా)లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు పని వేళల్లో.. వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 46 మంది సీజీవీలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రాన్ని శుభ్రం చేసుకోవడంతో మొదలుకొని దివ్యాంగ విద్యార్థులు సపర్యలు చేయడంలో సీజీవీల పాత్ర కీలకంగా ఉంటోంది. ఉన్నతాధికారుల చిన్నచూపు కారణంగా వీరికి నెల వేతనం రూ.3,250గా నిర్ణయించి చెల్లిస్తున్నారు. రోజుకు ఏడున్నర గంటలు పనిచేసే వీరికి కేవలం రూ.108 మాత్రమే వేతనంగా అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్‌లలో ఆయాలకు రూ.6 వేలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాలకు నెల వేతనం రూ.6 వేలు లభిస్తోంది. కానీ, వీరిద్దరికన్నా భవిత కేంద్రాల్లోని దివ్యాంగ పిల్లలకు సేవలందిస్తున్న ఆయాలకు తక్కువ వేతనాలు ఉండటంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


