ఎన్‌ఎఫ్‌బీఎస్‌ బాధ్యతలు ఎంపీడీవోలకు.. | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌బీఎస్‌ బాధ్యతలు ఎంపీడీవోలకు..

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

త్వరితగతిన చేసేందుకే..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రెంజల్‌(బోధన్‌): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) బాధ్యతలను ఎంపీడీవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పథకం తహసీల్దార్ల పరిధిలో ఉండేది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్షేత్రస్థాయిలో విచారించి అమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించేవారు. తహసీల్దార్లకు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడితోపాటు విచారణలోనూ తీవ్ర జాప్యం తలెత్తడంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సమస్యను అధిగమించేందుకు పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదలను ఎంపీడీవోల పరిధిలోకి తీసుకొచ్చింది.

పథకం వివరాలు..

నిరుపేద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడు మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 వేలు అందిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వేగంగా విచారణ చేపట్టిన వెంటనే నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి.

కుటుంబ యజమాని మరణిస్తే త్వరితగతిన సాయం అందించేందుకు ప్రభుత్వం బాధ్యతలను మార్పిడి చేసింది. లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మంజూరైన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

– కమలాకర్‌, ఎంపీడీవో, రెంజల్‌

Advertisement
 
Advertisement
Advertisement