● కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు
ధరించి ఉద్యోగుల నిరసన
నిజామాబాద్‌అర్బన్: జూన్ 2లోగా పీఆర్సీని అమ లు చేయాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్, సె క్రెటరీ శ్రీనివాసరావు అధ్యక్షతన 26 భాగస్వామ్య సంఘాలతో పలుమార్లు విన్నపాలు సమర్పించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నప్పటికీ నేటికీ నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు బకా యి ఉన్న రూ.13 వేల కోట్లకు పైగా బిల్లులను ఒకే సారి విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానం, ఆరోగ్య కార్డులను అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కోకన్వీనర్ మోహన్ రెడ్డి, కో చైర్మన్లు రమేశ్, రమణారెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేశ్, పండరీనాథ్, వైస్ చైర్మన్ విజయసింగ్, శేఖర్, అమృత్ కుమార్, అంగన్‌వాడీ, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


