
గుత్ప, అలీసాగర్ ఆయకట్టుకు నీటిని అందించాలి
నిజామాబాద్ సిటీ: గుత్ప, అలీసాగర్ ఆయకట్టు కింద రైతులు నాట్లు వేసుకున్న పొలాలకు నీటిని అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. గోదావరి నది నుంచి ఎస్సారెస్పీకి వరదలు వస్తున్నందున వెంటనే అధికారులు గుత్ప, అలీసాగర్ ఆయకట్టుకు నీటిని అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతాంగ ఉద్యమాల ఫలితంగా మోడీ ప్రభుత్వం మళ్లీ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పేరుతో దొడ్డిదారున తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, సాయిలు, గోపాల్, బన్సీ, బుచ్చన్న, రాపాని గంగాధర్, గోపాల్, దేవస్వామి పాల్గొన్నారు.