
బందీ నుంచి విముక్తి
ఖలీల్‌వాడి: బాలల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధానికి చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలనిస్తోంది. ఆకలి, ఆర్థిక సమస్యలతో బాల కార్మికులు పెరుగుతున్నారు. దీంతో అధికారులు వారిని పనిలోంచి బయటికి తీసుకొచ్చి, తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. జిల్లాలో పోలీసులు, బాలల సంరక్షణ, కార్మిక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలతో 154 మంది బాలలకు విముక్తి లభించింది.
తనిఖీలు ఇలా..
జిల్లాలో నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’ మూడు బృందాలు పనిచేశాయి. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎస్సైలు ఇంచార్జీలుగా, నలుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఐసీడీఎస్, కార్మిక శాఖ అధికారులతో కలిసి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. జూలై 1 నుంచి 31 వరకు ఈ బృందాలు జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, ఇటుక బట్టీలు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 154 మంది గుర్తించగా 148 మంది బాలుర, 6 మంది బాలికలను విముక్తి చేశారు. నిజామాబాద్ పరిధిలో 15, ఆర్మూర్‌లో 12, బోధన్‌లో 9 కేసులు నమోదు చేశారు. తప్పిపో యిన పిల్లల వివరాలను ‘దర్పణ్ యాప్’లో నమో దు చేసి, వారి అడ్రస్‌లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 56 మంది, బోధన్‌లో 56 మంది, ఆర్మూర్‌లో 42 మందిని గుర్తించారు. తప్పిపోయిన చిన్నారులను సైతం అక్కున చేర్చుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మరికొందరిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
కొన్ని రోజులకే యథాస్థితికి..
జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించిన కొన్ని రోజులకే యథాస్థితికి చేరుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలలకోసారి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులు తమ కుటుంబ అవసరాలకు మళ్లీ పనుల్లో చేరుస్తున్నారు. నిరంతరం కార్యక్రమాన్ని కొనసాగిస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’
జిల్లాలో 154 మంది బాలల గుర్తింపు
36 కేసులు నమోదు