
ఇందూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన
నిజామాబాద్ సిటీ: నగరంలో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల వివరాలు, జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సమీకృత మార్కెట్‌లో..
ఖలీల్‌వాడిలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోవడంపై కమిషనర్‌ను వివరణ అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. అహ్మదీబజార్‌లో నిర్మాణం పూర్తయినా వాడుకలోకి తీసుకురాకపోవడంపై ఆరా తీశారు. పాత గంజ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ ఆంక్షలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ఇబ్బందులు వస్తున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణలను తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం నాగారంలో నిర్మించిన రాజీవ్‌గృహకల్ప ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా అవసరమైన మరమ్మతులు చేయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
డంపింగ్ యార్డు సందర్శన..
నాగారం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ సందర్శించారు. బల్దియా చేపడుతున్న చెత్త సేకరణ, చెత్తనిల్వను పరిశీలించారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్ ప్రక్రియను చూశారు. పెద్ద మొత్తంలో కంపోస్ట్ తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించిన వ్యర్థాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతంలో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
బస్తీ దవాఖాన, పాఠశాల తనిఖీ
ఖానాపూర్‌లోని బస్తీ దవాఖానను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. దవాఖానకు వచ్చిన రోగులతో మాట్లాడారు. పీహెచ్‌సీ తరహాలో అన్నిరకాల సేవలందిస్తూ, మందులు సిద్ధం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు. అనంతరం కాలూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి మధ్యాహ భోజనాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో రవిబాబు, మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, డంపింగ్‌యార్డు ఇన్‌చార్జి ప్రభుదాస్, రషీద్, డీఈ ముస్తాక్ అహ్మద్, ఏఈ ఇనాయత్ కరీం, శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్‌తో కలిసి
అభివృద్ధి పనుల పరిశీలన
అలసత్వం వహిస్తున్న అధికారులు, గుత్తేదారులపై మండిపాటు
నాణ్యతతో పనులు వేగవంతం
చేయాలని ఆదేశం