
సామర్థ్యం ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తిపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 5 కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం కేవలం 54 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తికి 2.4 కోట్ల స్పాన్ అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1.75 కోట్ల స్పాన్‌ను ఉత్పత్తి చేశారు. మరో 65 లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. సామర్థ్యం కన్నా తక్కువ చేపపిల్లల ఉత్పత్తిపై అధికారులు నోరు మెదపడం లేదు.
తల్లి చేపల సేకరణ నుంచి..
జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో తల్లి చేపలను ఉంచి వాటి నుంచి గుడ్డును సేకరించి హెచరీలో బాయిల్డ్ చేసి స్పాన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన స్పాన్‌ను నర్సరీల్లో వేసి చేప పిల్లలను అంగుళం సైజ్ వరకు పెంచుతారు. 5కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి కావాలంటే కనీసం 15కోట్ల స్పాన్‌ను ఉత్పత్తి చేయాలి. అందుకు కనీసం రెండున్నర టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం 700 కేజీల తల్లి చేపలను మాత్రమే సేకరించారు. దీంతో మరోసారి స్పాన్ ఉత్పత్తి చేపడితే తల్లి చేపలు ఖాళీ అవుతాయి. అందుకే 2.4 కోట్ల స్పాన్ ఉత్పత్తి చేసి చేతులు దులుపుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని మత్స్య సహకార సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
నిరుపయోగంగా హెచరీలు..
చేపపిల్లల కేంద్రంలో జార్ హెచరీలు కొంతకాలంగా పని చేయడం లేదు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన ఎకో హెచరీల్లోనే స్పాన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. చైనీస్ హెచరీలను నిర్మించినా వాటిని వినియోగించడం లేదు. ఫలితంగా స్పాన్ ఉత్పత్తి కూడా తక్కువే అవుతుంది. సరైన పద్ధతిలో చేపపిల్లల ఉత్పత్తి చేపడితే జిల్లాలోని చెరువులు, ప్రాజెక్ట్‌లకు ఈ కేంద్రం నుంచే చేపపిల్లలను సరఫరా చేపట్టవచ్చు. కానీ, టెండర్ల ద్వారా వచ్చిన చేపపిల్లలను చెరువుల్లో వదులుతారు. కమీషన్లపై ఉన్న శ్రద్ధ చేపపిల్లల ఉత్పత్తిపై లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తికి మరో 20 రోజుల సమయం ఉంది. తల్లి చేపలుంటే మరింత స్పాన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉండేది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.
చేపపిల్లల ఉత్పత్తిలో నిర్లక్ష్యం!
ఎస్సారెస్పీలో ఈ ఏడాది
54 లక్షల చేప పిల్లల లక్ష్యం
పని చేయని జార్ హెచరీలు
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి
ప్రస్తుత సంవత్సరం 54లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా విధించారు. అందుకు అనుగుణంగానే చేపపిల్లల ఉత్పత్తి చేపడుతున్నాం. 700 కేజీల తల్లి చేపలను మాత్రమే సేకరించాం. మత్స్యకారులకు డబ్బులు చెల్లించకపోవడంతో తల్లి చేపలను ఇ వ్వడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– దామోదర్, ఎఫ్‌డీవో, పోచంపాడ్

సామర్థ్యం ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ