
కుక్కల దాడిలో నెమలి మృతి
సిరికొండ: మండల కేంద్రానికి సమీపంలో గురువారం సాయంత్రం కుక్కల దాడిలో జాతీయ పక్షి నెమలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ సమీపంలో మేత మేస్తున్న నెమలిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేశారు. నెమలి వద్దకు వారు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెమలి కళేబరానికి పంచనామా నిర్వహించి ఖననం చేసినట్లు ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో రవీందర్, డీఆర్వో గంగారాం తెలిపారు.
ఆలయాల్లో చోరీ
బోధన్: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలోని పలు ఆలయాల్లో గురువారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తె మట్టెలు, బంగారు నగలు చోరీ చేసి, మహాలక్ష్మి మందిరం, తుల్జాభవాని ఆలయం, శివాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి, నగదును ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమా సిబ్బందితో కలిసి గురువారం ఆలయాలను పరిశీలించారు. గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.