
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్
నిజామాబాద్ రూరల్: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏడాది శ్రావణమాసంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను గిరిజనులు జరుపుకుంటారు. తండాలు పాడి పంటలతో కళకళలాడాలని, ప్రజలను రోగాల బారి నుంచి రక్షించాలని జగదాంబ, సేవాలాల్, రామ్‌రావు మహరాజ్‌తో పాటు వనదేవతలను వేడుకుంటారు. తీజ్ పండుగలో భాగంగా వివిధ తండాల్లో ఉన్న జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ఆలయాల్లో గోధుమ బుట్టలకు తొమ్మిది రోజులపాటు యువతులు తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు.
ఉత్సవాల కోసం విరాళాలు
తీజ్ పండుగ నిర్వహణకు కావలసిన గోధుమలు, చిన్న వెదురు బుట్టల కొనుగోలు కోసం తండా పెద్దలు ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరిస్తారు. యువతులు పుట్టమన్ను తెచ్చి, అందులో గోధుమలు కలిపి వెదురు బుట్టలో వేసి, ఒక మంచైపె ఉంచుతారు. నాటి నుంచి యువతులు తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేపడతారు. రోజూ ఉదయం, సాయంత్రం బుట్టలో నీరు పోస్తారు. సాయంత్రంవేళ యువతులు బుట్టలు ఉన్న మంచి వద్ద గుంపులుగా చేరి ఉత్సవ గీతాలు అలపిస్తారు. బంజారా సంప్రదాయ నృత్యం చేస్తారు. తొమ్మిది రోజుల్లో బోరడి ఝష్కెరో, ఢమోళి, గణ్ గోర్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. తొమ్మిదో రోజు అసలైన తీజ్ ఉత్సవం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. తండా ప్రజలు తీజ్ బుట్టల నిమజ్జనానికి శోభాయాత్రగా వెళతారు. ఓ ప్రదేశంలో బుట్టలు కిందకి దించి వలయాకారంలో కూర్చుంటారు. ఈ సమయంలో బంధువులు, సోదరులు ఆ బుట్టల్లో తోచినంత డబ్బు కట్నంగా వేస్తారు. యువతులు తీజ్ నారు తెంపి పెద్దలు పెట్టుకున్న తలపాగాల్లో అమరుస్తారు. యువతుల పాదాలు సోదరులు నీటితో కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. యువతులు బుట్టలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ సమీపంలో చెరువు వద్దకు వెళుతారు. మొదట సేవాలాల్ మహారాజ్, దండియాడికి చెందిన తీజ్ బుట్టను నిమజ్జనం చేసిన అనంతరం ఒక్కొక్కరు తమ తమ బుట్టలను గీతాలాపనల మధ్య నిమజ్జనం చేస్తారు.
ప్రతియేటా ఆషాడ, శ్రావణమాసాల్లో ఉత్సవాల నిర్వహణ
గోధుమ బుట్టలకు తొమ్మిదిరోజులపాటు నిష్టతో పూజలు చేయనున్న యువతులు
రాష్ట్ర పండుగగా గుర్తించాలి..
తీజ్ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాలి. నిధులను విడుదల చేయాలి. పండుగలో పంటలు బాగా పండాలని తీజ్ పండుగ నిర్వహిస్తాం. ఎంతో నిష్టతో బంజారాలు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
–ప్రేమ్‌లాల్, బంజారా కవి, నిజామాబాద్