
క్రైం కార్నర్
ట్రాలీ ఆటో నుంచి పడి బాలుడు మృతి
మాక్లూర్: ట్రాలీ ఆటోలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ బాలుడు మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ నగరంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహిం తన సొంత ట్రాలీ ఆటోలో గురువారం భార్య ఫౌజియా సుల్తానా, నలుగురు బిడ్డలతో కలిసి ఆర్మూర్‌లోని బంధువుల ఇంటికి బయలుదేరారు. అడవి మామిడిపల్లి శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై అతడి కుమారుడు షేక్ అహ్మద్ (7) ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు
పాల్పడిన వ్యక్తి అరెస్టు
బోధన్: పట్టణంలో పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా.. పట్టణంలోని రెంజల్ బేస్ ప్రాంతానికి చెందిన మీనాజ్ అనే వ్యక్తి మట్కా నిర్వహిస్తుండేవాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలపకుండా ఉండటానికి మహ్మద్ అబ్దుల్ సోఫియాన్ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి అతడు ప్రతినెలా రూ.5వేల నుంచి రూ.10వేల వరకు డబ్బులు వసూలు చేయగా, ఇప్పటి వరకు రూ. 2లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదు చేసినట్లు బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. నిందితుడు సోఫియాన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్టు పేర్కొన్నారు.