
వారంలో రెండ్రోజులు ఫిజియోథెరపీ సేవలు
ఆర్మూర్: తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో శారీరక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు భవిత కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహించే శిబిరాలను రెండుసార్లకు పెంచడంపై పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో శారీరక వైకల్యంతోపాటు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 426 మంది విద్యార్థులను గుర్తించారు. వీరికి ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ల సహకారంతో ఎంపిక చేసిన ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
ఫిజియోథెరపిస్టుల కొరత..
జిల్లాలోని భవిత కేంద్రాలకు 15 మంది ఫిజియోథెరపిస్టులు అవసరం కాగా, ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కొరత ఉండటంతో కొత్త వారిని విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో శిబిరానికి వెయ్యి రూపాయల చొప్పున ఫిజియోథెరపిస్టులకు ఫీజు రూపంలో చెల్లిస్తున్నారు. వీరు ఫిజియోథెరపీ పరికరాలను ఉపయోగించి నడకను నేర్పిస్తున్నారు. పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులకు ఇంటి వద్దే చేయాల్సిన వ్యాయామాన్ని సూచిస్తారు. కాగా, తీవ్రమైన వైకల్యంతో బాధపడే పిల్లలను ప్రతిసారి శిబిరానికి తీసుకురావడం ఇబ్బందికరంగా ఉండడంతో ఇంటి వద్దనే ఫిజియోథెరపీ చికిత్సను ఉచితంగా అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దివ్యాంగులకు వరం..
సహిత విద్యా విభాగం
దివ్యాంగ విద్యార్థులకు
నడక నేర్పుతున్న భవిత కేంద్రాలు