
నిజాయితీ చాటుకున్న కండక్టర్
కామారెడ్డి క్రైం: బస్సులో మరిచిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలికి అప్పగించి కామారెడ్డి డిపోకు చెందిన కండక్టర్ సువర్ణ తన నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్‌కు వెళ్లింది. అందులో ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మర్చిపోయి జేబీఎస్‌లో దిగిపోయింది. బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ తన వద్ద భద్రపరిచారు. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికురాలు తన బ్యాగు కనిపించడం లేదంటూ తిరిగి బస్టాండ్‌కు వచ్చింది. అక్కడే ఉన్న కండక్టర్ ప్రయాణికురాలికి బ్యాగును అప్పగించింది. కాగా, బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌తోపాటు కొంత నగదు ఉంది. పోయిందనుకున్న బ్యాగు తిరిగి దొరకడంతో ప్రయాణికురాలు కండక్టర్ సువర్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు నిజాయితీ చాటుకున్న కండక్టర్‌ను అభినందించారు.