
ప్రభుత్వ కళాశాలలో బయోమెట్రిక్ అటెండెన్స్
● డీఐఈవో రవికుమార్
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ పేర్కొన్నారు. డీఐఈవో కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలుకు విద్యార్థుల బయోడేటా, ఆధార్‌ను ఇంటర్ బోర్డు లాగిన్‌లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అపార్ నెంబర్ గుర్తింపుతోపాటు యుడైస్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంటర్ బోర్డు సూచించిన సెంట్రలైజ్డ్ టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని తెలిపారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, పేరెంట్స్ మీటింగ్‌లు నిర్వహించాలని పేర్కొన్నారు. కళాశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.