
మైనారిటీ డిక్లరేషన్ అమలేదీ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మైనారిటీల అభ్యున్నతి కోసం రూ.4 వేల కోట్లు కేటాయించి, ప్రత్యేకంగా ఉప ప్రణాళిక అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మరచిందని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర దాటినప్పటికీ దీని ఊసేలేదని, గత ఎన్నికల్లో పేరుకే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించారని అంటున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజవ్‌ులకు ఇచ్చే గౌరవ వేతనం చెల్లించే విషయంలోనూ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజవ్‌ులకు గత ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ వచ్చింది. ఇలా పనిచేసే వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,200 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవ వేతనాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఓ స్థానిక ఉర్దూ పత్రికలో ప్రకటన ఇచ్చింది. మసీదు ధ్రువీకరణ పత్రంతోపాటు గతంలో లేనివిధంగా పాన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సైతం జత చేయాలని నిబంధనలు పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇన్‌కం సర్టిఫికెట్లు తెచ్చుకోలేకపోతున్నారు. అలాగే గడువు సైతం జూలై 31 వరకే ఇవ్వడంతో అత్యధిక మంది ఇమామ్‌లు, మౌజమ్‌లు దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో గడువు పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇమామ్‌లకు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.12 వేలకు పెంచుతామని ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు పెంచకపోగా ఇలా కఠిన నిబంధనలు పెట్టడమేమిటని పలువురు అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇలాంటి నిబంధనలు లేవని, పైగా ప్రస్తుతం నెలనెలా చెల్లింపులు చేయకుండా మూడునెలలకోసారి చెల్లిస్తున్నారని చెబుతున్నారు.
డిక్లరేషన్ వదిలేసి ఇమామ్‌లు, మౌజవ్‌ుల గౌరవ వేతనాల విషయంలో కొర్రీలు
దరఖాస్తులకు పరిమిత గడువుతో
సమస్యలు
ప్రతిపాదనలు పంపాం..
నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. దరఖాస్తుల గడువు పెంచే విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం.
– అసదుల్లా,
సీఈవో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు
కోత పెట్టేందుకే కఠిన నిబంధనలు..
ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇస్తున్న గౌరవ వేతనాల్లో కోత పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఎన్నికల హామీ మేరకు గౌరవ వేతనాలు పెంచకపోగా కావాలనే కఠిన నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం గడువును మరో నెలరోజులు పొడిగించాలి. మూడు నెలలకొకసారి ఇస్తున్న గౌరవ వేతనాలను గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా నెలనెలా ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన సరికాదు.
– యాకూబ్‌పాషా, రాష్ట్ర అధ్యక్షుడు, మైనారిటీ సంక్షేమ సంఘం

మైనారిటీ డిక్లరేషన్ అమలేదీ?