
మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణాభివృద్ధి
కమ్మర్‌పల్లి: గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మహిళలు భాగస్వామ్యం అయినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ పథకాల పర్యవేక్షక బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్ పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండలంలోని అమీర్‌నగర్, డీసీ తండా గ్రామాల్లో వారు బుధవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాల అమలు తీరు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవన నిర్మాణాలతోపాటు ప్లాంటేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని సూచించారు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల కల్పన మిషన్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వడంతోపాటు రుణ పరిమితిని సైతం పెంచినట్లు ఐకేపీ అధికారులు తెలిపారు.
వినతుల వెల్లువ..
ఉపాధి పని దినాలను పెంచాలని, మహిళా సంఘాలకు వడ్డీ తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కేంద్ర బృందం సభ్యులకు స్థానికులు విన్నవించారు. అందుకు స్పందించిన సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. డీసీ తండాలో జీపీ భవనానికి సంబంధించి బిల్లు రాలేదని మాజీ సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్