
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మాక్లూర్: అధికారులు విధులు నిర్వహించటంలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, సొసైటీలతో పలు ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యా కేంద్రానికి వచ్చే ప్రజల పట్ల ప్రేమానురాగాలతో ఉండి తగిన వైద్యం అందించాలని మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సూచించారు. సొసైటీలో ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన పట్టికను గుమ్మం ఎదుట ఉంచటంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు పొదుపు సంఘాల్లో దగ్గరుండి రుణాలు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శి రాకేష్‌ను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి, పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో ఉన్న శాఖ గ్రంథాలయం తాళం వేసి ఉండటంతో శాఖ గ్రంథపాలకుడుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకే తీయాల్సిన గ్రంథాలయం 11 అవుతున్న ఎందుకు తీయలేదని సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఫోన్ ద్వారా ఆరాతీశారు. అనంతరం ఎంఈవో కార్యాలయంలో ఇతర సిబ్బంది లేకపోవటాన్ని గమనించి కలెక్టర్ మండిపడ్డారు. ఇక ముందు ఇలా ఉంటే సహించేది ఉండదని హెచ్చరించారు.
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
మాక్లూర్‌లో ఆకస్మిక పర్యటన