ఓల్టేజీ సమస్య తలెత్తకుండా.. | - | Sakshi
Sakshi News home page

ఓల్టేజీ సమస్య తలెత్తకుండా..

Jul 30 2025 6:46 AM | Updated on Jul 30 2025 6:46 AM

ఓల్టే

ఓల్టేజీ సమస్య తలెత్తకుండా..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలను కూరగాయల సాగు దిశగా ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందించే అంశాన్ని పరిశీలిస్తామని జిల్లా ఇన్‌చార్జి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి మంత్రి సీతక్క అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా(పైలట్‌ ప్రాజెక్టు) అమలు చేసి, ఆ తరువాత రాష్ట్రమంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో, సమష్టి కృషితో ముందుకెళ్తూ అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్‌ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఎరువులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టికి చేపడుతున్న కార్యక్రమాలు, గృహజ్యోతి, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ శాఖల పనితీరుతోపాటు తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్షించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అప్పుడే సమస్యలు తెలిసి వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖలకు సంబంధించిన పెండింగ్‌ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్‌ బీమా తదితర ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించి, మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.

జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వచ్చే రెండు నెలలపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు మందుతోపాటు అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.

సీఎంఆర్‌ డిఫాల్టర్లపై..

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన రైస్‌ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చేయాలని సీతక్క ఆదేశించారు. డిఫాల్టర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ట్రెయినీ కలెక్టర్‌ కరోలినా చింగ్తియాన్‌ మావీ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర రైతు, వ్యవ సాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు సూదం లక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి సీతక్కకు కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యతోపాటు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. టీఎన్జీవో, టీజీవో, ఇతర సంఘాల ప్రతినిధులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.

ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్‌పాల్‌ డెడ్‌లైన్‌

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. గతేడాది ని ర్వహించిన సమీక్షాసమావేశంలో హౌసింగ్‌ మంత్రి మాట్లాడుతూ.. దసరా నాటికి ఇళ్లు పంపిణీ చేస్తా మని చెప్పారని, ఇప్పటికీ అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల్లో పేదలకు ఇళ్లు అప్పగించకపోతే వారి తరఫున ఉద్యమిస్తానని, అప్పటి కీ ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరాహార దీక్ష చే స్తానని స్పష్టం చేశారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వై ద్యులు లేరని, జీజీహెచ్‌లో మౌలిక వసతులు లేవని సమస్యలను లేవనెత్తారు. మదర్‌–చైల్డ్‌ విభాగం ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పక్కన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌, పోచారం, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్‌పాల్‌, భూపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓల్టేజీ సమస్య తలెత్తకుండా చూడాలని విద్యుత్‌ అధికారులకు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎప్పుడో 20 ఏళ్ల కిందట గృహజ్యోతి పథకం వచ్చిందంటూ అధికారులు కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుంకెట అన్వే ష్‌రెడ్డి మాట్లాడుతూ.. అంకాపూర్‌లో ఉన్నట్లుగా పెర్కిట్‌–మోర్తాడ్‌ మధ్యలో, బాల్కొండ–పోచంపాడ్‌ మధ్యలో జాతీయ రహదారిపై ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు నిర్మించాలన్నారు. రామడుగు చివరి ఆయకట్టు అయిన వేల్పూర్‌ మండలంలోని పచ్చల నడ్కుడ, వాడి, కొత్తపల్లి, అట్లూర్‌, భీంగల్‌ మండలంలోని చేంగల్‌, బడాభీంగల్‌ గ్రామాలకు సాగునీరు అందడంలేదని.. నవాబ్‌ ఎత్తిపోతల పథకం నుంచి పచ్చలనడ్కుడ చెరువుకు నీటిని తరలిస్తే ఆరు గ్రామాలకు సాగునీటి సమస్య తప్పుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరారు.

ఓల్టేజీ సమస్య తలెత్తకుండా..1
1/1

ఓల్టేజీ సమస్య తలెత్తకుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement