
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. సోమవారం రాత్రి వరకు 65 వేల క్యూసెక్కులు వచ్చిన వరద నీరు రాత్రికి 75 వేల 500 క్యూసెక్కులకు పెరిగింది. నిలకడగా అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్లీ వరద నీరు పెరిగి 89 వేల క్యూసెక్కులకు చే రింది. మంగళవారం ఉదయం 9 గంటలకు వర ద నీరు పెరిగి లక్ష 5 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈ సంవత్సరం లక్ష క్యూసెక్కుల వరద నీరు దాటడం ఇదే తొలిసారి. మధ్యాహ్ననం 12 గంటలకు మళ్లీ తగ్గుముఖం పట్టి 86 వేల 620 క్యూసెక్కులకు పడిపోయింది. తరువాత మరింత తగ్గి 67, 401 క్యూసెక్కులకు పడిపోయింది.
సాయంత్రం 6 గంటలకు 64 వేల 345 క్యూసెక్కులకు తగ్గిపోయింది. రాత్రి వరకు అంతే స్థాయిలో వరద ప్రాజెక్ట్‌లోకి కొనసాగింది. ప్రాజెక్ట్‌లోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం రాత్రికి ప్రాజెక్ట్‌లో 1076.80 (36.9 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
లక్షా 5 వేల క్యూసెక్కుల వరద నీరు
వేగంగా పెరుగుతున్న నీటి మట్టం
నీటి నిల్వ 36.9 టీఎంసీలు!
గతేడాది నీటి మట్టాన్ని దాటి..
ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం గతేడాది ఇదే రోజున ఉన్న నీటి మట్టాన్ని దాటింది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 1075.20 (33.37 టీఎంసీలు) నిల్వ ఉంది. ఆ నీటి నిల్వను మధ్యాహ్ననికే దాటి నీటి మట్టం పె రుగుతోంది. ప్రాజెక్ట్‌నీటి మట్టం వేగంగా పెరగడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.