
బోటింగ్‌కు వెళ్లి సరస్సులో పడిపోయి..
● అమెరికాలో ఎత్తొండ క్యాంపు వాసి మృతి
రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ క్యాంపునకు చెందిన వడ్లమూడి హరికృష్ణ (49) అమెరికాలో ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి మృతి చెందిన ఘటన మూడు రోజుల క్రితం (శనివారం) చోటు చేసుకుంది. సరదాగా బోటింగ్‌కు వెళ్లిన హరికృష్ణ సరస్సులో మునిగి మృతి చెందాడన్న సమాచారంతో ఎత్తొండ క్యాంపులో విషాదఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణకు భార్య శిల్ప, కూతుళ్లు యుక్త, సరయు ఉన్నారు. 25ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి ఏడాది, రెండేళ్లకోసారి ఎత్తొండ క్యాంపునకు వచ్చి స్నేహితులు, బంధువులతో గడిపి వెళ్లేవారు. ఆరు నెలల క్రితం హరికృష్ణ తల్లిదండ్రులు సరస్వతి, రాధాకృష్ణ అమెరికా వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. కాగా, హరికృష్ణ అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
ఒకరికి రెండు రోజుల జైలు
వర్ని: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయి శివ తీర్పునిచ్చారు. ఈ నెల 20న బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన ఓల్లెపు పాపయ్య మద్యం తాగి వాహనం నడుపుతుండగా వర్ని మండల కేంద్రంలో పట్టుకొని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.