
అక్కను కాపాడబోయి చెల్లి
దోమకొండ: బట్టలు ఉతుకుతూ నీటిలో జారిపడిన అక్కతోపాటు కాపాడేందుకు ప్రయత్నం చేసిన చెల్లెలు నీటి కుంటలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గోసంగికి చెందిన పలువురు కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం సాయంత్రం గంగారపు మల్లేశం కూతుళ్లు పెద్దరాగుల శివాని(23), చిన్నరాగుల మల్లవ్వ (19) బట్టలు ఉతకడానికి నరసింగరాయకుంటకు వెళ్లారు. బట్టలు ఉతికే క్రమంలో అక్క శివాని నీటిలో జారిపడగా, అక్కను కాపాడే ప్రయత్నంలో చెల్లెలు మల్లవ్వ కూడా నీటిలోకి దిగింది. కాగా, ఇరువురు నీటి మునిగారు. స్థానికంగా వ్యవసాయ పనులు చేసి ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి మల్లేశంతోపాటు శివాని భర్త దుర్గయ్య, మల్లవ్వ భర్త రమేశ్ కుంట వద్దకు చేరుకొని ఇరువురి కోసం వెతికారు. ఆదివారం రాత్రి మల్లవ్వ మృతదేహం, సోమవారం శివాని మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.
గుంతే ప్రాణం తీసిందా...
అక్కాచెల్లెళ్లు బట్టలు ఉతుకుతున్న ప్రదేశంలో నీటి గుంత ఉంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలోకి నీరు చేరింది. గుంతను గమనించని వారు బట్టలు ఉతికే క్రమంలో నీటిలోకి దిగడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రదేశం వద్ద పోలీసులు కట్టెలతో నీటి లోతును పరిశీలించారు. మొదట శివాని నీటిలో పడడంతో, ఆమెను పట్టుకుందామనే ప్రయత్నంలో మల్లవ్వ కూడా నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. తండ్రి గంగారపు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వివరించారు.
బట్టలు ఉతకడానికి వెళ్లి
నీటికుంటలో పడి ఇద్దరూ మృతి
దోమకొండలో ఘటన

అక్కను కాపాడబోయి చెల్లి