
ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూడాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఆహార పదార్ధాలను కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని మహాత్మా జ్యోతీబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని సూచించారు. గురుకులంలో ఇంకా ఏమైనా సదుపాయాలు అవసరం ఉన్నాయా అని ప్రిన్సిపల్ శ్రీకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఎంజేపీ బాలుర గురుకుల
పాఠశాల తనిఖీ