
తాళం వేసిన రెండిళ్లలో చోరీ
బాల్కొండ: మండల కేంద్రంలోని తాళం వేసిన రెండిళ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, ఎస్సై శైలెంధర్ తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పుట్టి సుమంతి ఇంటికి తాళం వేసి ఉండగా శనివారం అర్ధరాత్రి దుండగులు తాళం పగులగొట్టి, ఇంట్లోని 6.7 తులాల బంగారం, ఆరు తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. అలాగే అదే గ్రామంలోని తాళం వేసి ఉన్న సంతోష్ గౌడ్ ఇంట్లోకి దుండగులు చొరబడి నగదును చోరీ చేశారు. ఉదయం స్థానికులు చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శైలెంధర్ సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వ్యవసాయ మోటార్ల కేబుల్ వైరు..
ధర్పల్లి: మండల కేంద్రం శివారులోని పంట పొలాల వద్ద సుమారు 20 వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. ఆదివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు సబ్‌మెర్సిబుల్ మోటారు నుంచి మెయిన్ బోర్డ్ వరకు ఉండే కేబుల్ వైర్లు కట్ చేసి ఉండడాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. పంటలకు నీరు పెట్టాలంటే మళ్లీ ప్రతి మోటార్‌కు కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి సమయంలో గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకుని కేబుల్ వైర్ చోరీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.