
ఉపాధి ఎరవేసి.. ఇరికించారు
మోర్తాడ్(బాల్కొండ): యూరప్‌లో ఉపాధి కల్పిస్తామంటూ ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మి వెళ్లిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన గంగాప్రసాద్ దుబాయ్‌లో చిక్కుకుపోయాడు. మూడేళ్లుగా స్వదేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తమ కుమారుడిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని కోరుతూ బాధితుడి తండ్రి భోజన్న, అన్న ప్రసాద్ హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిల సహకారంతో ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఇటీవల వినతిపత్రం అందజేశారు. దీంతో గంగాప్రసాద్‌ను మోసగించిన ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చిన్నారెడ్డి పోలీసులకు సూచిస్తూ లేఖ రాశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితుడిని రప్పిస్తామని హామీ ఇచ్చారు.
యూరప్ పేరిట గాలం..
పడిగెల గ్రామానికి చెందిన గంగాప్రసాద్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశాడు. మూడేళ్ల కిందట యూరప్‌లోని హోటల్ రంగంలో ఉపాధి కల్పిస్తామని నమ్మించిన ఇద్దరు ఏజెంట్లు గంగాప్రసాద్ నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేశారు. మొదట దుబాయ్‌లో ఆరు నెలలపాటు ఉంటే అక్కడి నుంచి యూరప్ తరలిస్తామని చెప్పారు. ఏజెంట్ల మాటలు నమ్మిన గంగాప్రసాద్ దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ ఓ డమ్మీ కంపెనీలో ప్రసాద్‌కు ఐటీ మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు నకిలీ ఐడీ కార్డును అందజేశారు. అదే ఐడీ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిపించి చెక్‌బుక్ తీసుకున్నారు. ఆ చెక్కులపై గంగాప్రసాద్‌తో సంతకాలు చేయించుకొని అతని పేరిట షార్జాలో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత యూరప్ పంపే విషయమై అడిగితే దాటవేస్తూ వచ్చారు. దీంతో అక్కడే ఉంటూ బయట వంట మనిషిగా పనిచేస్తూ వచ్చాడు. స్వదేశానికి వచ్చేందుకు ఏప్రిల్ 13న దుబాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా గంగాప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షార్జాలో ఇంటి ఒప్పందం చేసుకొని ఇచ్చిన చెక్కులు చెల్లలేవని, దీంతో కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇంటి అద్దె ఒప్పందంలో భాగంగా 27వేల ధరమ్స్ చెల్లించాలని వెల్లడించారు. మొదట బెయిల్ ఇవ్వడానికి 4వేల ధరమ్స్‌ను ప్రసాద్ కుటుంబసభ్యులు షార్జాకు పంపించారు. ఇంకా 23వేల ధరమ్స్(రూ.5.4లక్షలు)చెల్లించాల్సి ఉంది. కాగా, గంగాప్రసాద్ పేరిట భవనాన్ని అద్దెకు తీసుకున్న ఏజెంట్లు.. థర్డ్ పార్టీకి అద్దెకు ఇచ్చి తమ జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏజెంట్ల మోసానికి బలైన పడిగెల వాసి
బాధితుడి పేరిట దుబాయ్‌లో ఇల్లు అద్దె
తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు
ఏజెంట్లపై కేసు నమోదుకు
ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి సూచన