
క్రైం కార్నర్
దుబాయ్ నుంచి స్వగ్రామానికి
చేరిన మృతదేహం
● తలకొరివి పెట్టిన తల్లి
డిచ్‌పల్లి/ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో కొన్ని రోజుల క్రితం మృతిచెందగా ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి గ్రామానికి చెందిన నీరడి భోజన్న (44) ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల క్రితం దుబాయి వెళ్లాడు. 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురై, గుండెపోటు రావడంతో అక్కడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుబాయ్‌లోనే ఉంటున్న అతడి తమ్ముడు మృతదేహాన్ని గ్రామానికి పంపించేందుకు కంపెనీ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ కంపెనీ వారితో మాట్లాడగా, మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు సహకరించింది. ఆర్గనైజేషన్‌కు చెందిన అజ్మన్ ఇన్‌చార్జి భూమేష్ సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. మృతుడు తమ్ముడికి టికెట్టు సమకూర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపించారు. ఆదివారం స్వగ్రామానికి చేరుకున్న మృతదేహానికి తల్లి లింగవ్వ తలకొరివి పెట్టింది. మృతుడు భోజన్నకు భార్య సుమ (ప్రస్తుతం నిండు గర్భిణీ), ఒక కూతురు ఉంది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, తెలుగు హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ సభ్యులు కోరుతున్నారు.
పోచారంలో పోచమ్మ గుడి, పుట్ట ధ్వంసం
బోధన్: ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారులో చెట్ల కింద ఉన్న నాగదేవత పుట్ట, పోచమ్మ గుడిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ఽతవ్వేశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు ఆదివారం ఉదయం గుడి వైపు వెళ్లగా ఆలయ ధ్వంసంను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రతి ఏటా నాగుల పంచమినాడు గ్రామంలోని మహిళలు ఇక్కడి పుట్టకు పూజలు చేసి పాలుపోస్తారని మంగళవారం నాగుల పంచమి ఉండగా పుట్ట ధ్వంసం కావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎడపల్లి ఎస్సై రమా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆలయ పున:నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

క్రైం కార్నర్