
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
నిజామాబాద్ నాగారం: ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీరామగార్డెన్‌లో ఆదివారం ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా నిలిచారన్నారు. అన్నదాన కార్యక్రమాల నుంచి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల గురించి కొంత మంది ఎక్కువ ఆలోచిస్తున్నారన్నారు. ఆలా అలోచించి చివరికి నవ్వులపాలు కావద్దని విజ్ఞప్తి చేశారు. నూతనంగా గెలిచిన వారందరిని అభినందిస్తూ, ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని వారికి సూచించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.