
చిరుతల అలజడి
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో చిరుతల అలజడి పెరిగింది. ఆహారం, నీటి కోసం సంచరిస్తూ అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అలా వస్తున్న చిరుతలు పశువులు, మేకల మందలపై దాడులు చేసి చంపుతున్నాయి. దీంతో పశువుల కాపరులకు భయం పట్టుకుంది. ఇటీవల పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు ఎక్కువగా కనిపిస్తుండడంతో ఆ ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ జూలై నెలలోనే జరిగిన వరుస ఘటనలు అటవీ అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ట్రాప్ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో చిరుతలతోపాటు ఇతర వన్యప్రాణుల కదలికలను కనిపెట్టలేకపోతున్నారు. చిరుతలు ఎక్కు వగా ఉన్న ఇందల్వాయి అటవీ రేంజ్‌లో 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ లేకపోవడంతో చిరుతలు హైవేపై సంచరిస్తున్నాయి.
ఈ నెలలోనే ఆరు ఘటనలు...
● 11వ తేదీన సిరికొండ మండలం తాటిపల్లి అడవుల్లో పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఇక్కడి నుంచి వెళ్లిన పులి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ అడవుల్లో ఆవుపై దాడిచేసింది చంపింది. పెద్దపులి జాడ ఇంతవరకు లభించలేదు.
● 13వ తేదీన నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలోని నాగారం డంపింగ్‌యార్డు గుట్ట ప్రాంతంలో చిరుత కనిపించింది. స్థానికులు వీడియో తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. తరుచూ ఇదే ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
● 17వ తేదీన ఎడపల్లి మండలం జానకంపేట్ శివారులో మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను పట్టుకెళ్లింది. ఈ ఘటన మేకల కొట్టంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయాన్ని మేకల యజమాని సందీప్ అటవీ అధికారులకు తెలుపడంతో వారు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదే రోజున సిరికొండ మండలం పాకాల శివారులో జిట్టపులి లేగదూడపై దాడిచేసి చంపేసింది. డీఎఫ్‌వో నిఖిత మృతి చెందిన లేగదూడను పరిశీలించారు.
● జూలై 24, 26 తేదీల్లో నవీపేట్ మండలం నందిగామ, సిరన్‌పల్లి గ్రామాల్లో చిరుతలు సంచరించాయి. సిరన్‌పల్లిలో మేకల మందపై చిరుత దాడిచేసింది. నందిగామలో చిరుత పాదముద్రలు కనిపించగా, మరుసటి రోజే గుట్టపై చిరుత కనిపించింది. దీనిని స్థానికులు వీడియో, ఫొటోలు తీశారు.
● ఫిబ్రవరి 21న నవీపేట్ మండలం అబ్బాపూర్‌లో ఓ రైతుకు చెందిన పశువుల కొట్టంలోకి చొరబడిన చిరుత రెండు లేగదూడలపై దాడిచేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అడవుల్లోకి వెళ్లొద్దు
చిరుతల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వచ్చి మేక లు, పశువుల కొట్టాల్లోకి చొరబడి దాడి చేస్తున్నా యి. అడవుల్లోకి వెళ్లకుండా కొద్ది దూరం వరకే కాపరులు పశువులను తీసుకెళ్లాలి. చిరుత పులులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – సంజయ్‌గౌడ్, ఎఫ్‌ఆర్వో,
నిజామాబాద్ నార్త్
జిల్లాలో పెరిగిన సంచారం
ఆహారం, నీటి కోసం అన్వేషిస్తూ
అడవి నుంచి బయటికి..
లేగదూడలు, మేకల మందలపై
వరుస దాడులు
భయబ్రాంతులకు గురవుతున్న
ప్రజలు, పశువుల కాపర్లు

చిరుతల అలజడి