
పులి.. జాడేదీ?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన అరుదైన అతిథి.. ఎటువెళ్లిందన్న విషయమై స్పష్టత రావడం లేదు. పక్షం రోజులుగా అటవీ అధికారులు వెతుకుతున్నా పెద్దపులి జాడ కనిపించడం లేదు. నిఘా కోసం ఏర్పాటు చేసిన కెమెరాలలోనూ ఎలాంటి ఆధారాలూ రికార్డు కాలేదు. దీంతో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు భయంభయంగా గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరించినట్లు ఈనెల 11వ తేదీన అటవీ అధికారులు పాదముద్రల ద్వారా నిర్ధారించారు. ఆ తరువాత కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్‌తండా అటవీ ప్రాంతంలో పక్షం రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. దాడి చేసిన ప్రాంతంలో అడుగులను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. అవి పులివేనన్న తేల్చారు.
26 కెమెరాల ఏర్పాటు..
ఆవుపై దాడి చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో నలువైపులా కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలు రాత్రింబవళ్లు పనిచేస్తాయి. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తే కచ్చితంగా కెమెరాకు చిక్కుతుంది. దాదాపు 26 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. కెమెరాలను రెగ్యు లర్‌గా పరిశీలిస్తున్నారు. కానీ ఏ ఒక్కదానిలోనూ పులి సంచారం రికార్డు కాలేదు. పులి తిరుగుతున్న నేపథ్యంలో పశువులు, మేకల కాపరులు అడవి లోపలికి వెళ్లడం లేదు. బయట మేపుతున్నారు.
పక్షం రోజులుగా వెతుకుతున్నా ఫలితం శూన్యం
కెమెరా కంటికీ చిక్కని వైనం