
జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవనం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.3కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాలకవర్గం తీర్మానించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం సంస్థ అధ్యక్షుడు అంతి రెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పడిన నూతన మండలాల్లో శాఖ గ్రంథాలయాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆర్మూరు శాఖ గ్రంథాలయంలో పాఠకులు అధికంగా వస్తున్నందున పనివేళలను మరో ఆరు గంటలు పొడిగించామన్నారు. అన్ని గ్రంథాలయాల్లో పాఠకుల సౌకర్యం కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.