
వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో యూనిట్లు
మోర్తాడ్(బాల్కొండ): దివ్యాంగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి, వ్యాపార వృద్ధికి ఆర్థిక చేయూతను అందించడానికి ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై రుణాలను అందిస్తోంది. ఈక్రమంలో ప్రస్తుత సంవత్సరం (2025–26)కు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిసారి జిల్లావ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, పదుల సంఖ్యలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీరుణం అందిస్తోంది. దీంతో రుణం దక్కని దరఖాస్తుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూనిట్ల సంఖ్య పెంచితేనే..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులకు ఇచ్చే రుణ లక్ష్యంను ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో 33 యూనిట్లకు రూ.50వేల చొప్పున వంద శాతం రాయితీతో సాయం అందించనున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణం అందించి సబ్సిడీని వర్తింపచేయనున్నారు. మొత్తం 36 యూనిట్లకు రాయితీ కోసం ప్రభుత్వం రూ.20.50 లక్షలను కేటాయిస్తూ నిర్ణయించింది. వంద శాతం రాయితీ కోసం రూ.16.50 లక్షలు, బ్యాంకు లింకేజీ రుణాలకు రాయితీ కోసం రూ.4లక్షలను కేటాయించారు. జిల్లాలో స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగుల సంఖ్య వేలల్లో ఉంటే రాయితీ రుణాలను మాత్రం 36 మందికే మంజూరు చేయనున్నారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలోనే యూనిట్లకు రాయితీ అందిస్తుండటంతో దివ్యాంగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రతి ఏటా వంద మందికి రుణ సదుపాయం కల్పిస్తూ పోతే దివ్యాంగులైన నిరుద్యోగులకు ఎంతో ఆసరాగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం స్పందించి దివ్యాంగులకు ఇచ్చే రాయితీ యూనిట్ల సంఖ్యను పెంచాలని పలువురు కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన తంగళ్లపల్లి చిరంజీవి. ఇతడు పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. కూల్‌డ్రింక్స్, జిరాక్సు సెంటర్‌తో పాటు మొబైల్ ఫోన్లను రిపేర్ చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. దివ్యాంగులకు ఇచ్చే రాయితీ రుణం తనకు అందితే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని భావించాడు. 2021 నుంచి ప్రతి ఏటా దివ్యాంగులకు ఇచ్చే వంద శాతం రాయితీ రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నా, అతనికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. ఇది ఒక్క చిరంజీవికే కాకుండా ఎంతో మంది దివ్యాంగులకు ఎదురవుతున్న చేదు అనుభవం.
దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం
రాయితీ రుణాలను
అందిస్తోన్న ప్రభుత్వం
జిల్లాలో ప్రతియేటా వేలాది మంది
దరఖాస్తు చేసుకుంటున్న వైనం
పంపిణీకి మాత్రం అరకొర
యూనిట్లే మంజూరు
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు
చిన్నచూపు తగదు..
ప్రభుత్వం దివ్యాంగులపట్ల చిన్న చూపు చూడటం తగదు. ది వ్యాంగులకు ప్రతి ఏటా పదుల సంఖ్యలోనే రాయితీ రుణాలను అందిస్తున్నారు. వేల సంఖ్యలో దివ్యాంగులు ఉంటే పదుల సంఖ్యలో యూనిట్లను మంజూరి చేయడం ఎంత వరకు సమంజసం. వెంటనే యూనిట్ల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సుజాత సూర్యవంశి, వికలాంగుల
హక్కుల సమితి జాతీయ అధ్యక్షురాలు

వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో యూనిట్లు

వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో యూనిట్లు