
సెక్యూరిటీ గార్డ్‌పై దాడి
మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండా ర్ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బట్టు నరేష్‌పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈవిషయమై మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలించారు. నిందితుల బైక్ నంబర్ సహాయంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
ఇద్దరిపై కేసు నమోదు
రుద్రూర్: అదనపు కట్నం కోసం వేధించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన రాజేష్‌తో కోటగిరి మండల కేంద్రానికి చెందిన రజితకు 19ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇటీవల రజితను అదనపు కట్నం తెమ్మని భర్త రాజేష్, అత్త గంగమణి వేధించి, ఇంట్లో నుంచి పంపించివేశారు. దీంతో బాధితురాలు శుక్రవారం కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
మాణిక్‌భండార్‌లో గంజాయి కలకలం
మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండార్ శివారులోగల పోచమ్మ ఆలయం సమీపంలో గంజాయి తాగుతున్న 9మంది యువకులను శుక్రవారం పట్టుకుని కేసు నమోదు చేసినట్టు మాక్లూర్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారంతా 20 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకులేనని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరి వద్ద కోనుగోలు చేశారు. ఎంతకాలంగా ఇలా గంజాయి తాగుతున్నారు అనేది విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మాక్లూర్: మండలంలోని గుత్ప గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గురువారం తన ఇంటికి తాళం వేసి, మరో ఇంట్లో నిద్రించాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మాక్లూర్ పోలీసులకు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీంతో వేలిముద్రలు సేకరించుకొని వెళ్లారు. దుండగులు ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయమై ఎస్సై రాజశేఖర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఏర్గట్ల ఎస్సైపై సీపీకి ఫిర్యాదు
ఖలీల్‌వాడి: ఏర్గట్ల ఎస్సై, కానిస్టేబుళ్లపై శుక్రవారం బాధితుడు ఏర్గట్లకు చెందిన రాజ్ కుమార్ సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. ఈ నెల 22న అర్ధరాత్రి ఏర్గట్ల మండల కేంద్రంలోని ఓ మంగళి దుకాణంలో షట్టర్ క్లోజ్ చేసి రాజ్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురు మద్యం సేవిస్తున్నారు. అయితే ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ముగ్గురిని వివరాలను అడిగి పంపారని, తనను వివరాలు అడిగితే నెలన్నర క్రితం గల్ఫ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే ఎస్సై, కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. దీనికి ససేమిరా అనడంతో చితకబాధినట్లు చెప్పారు. దీనిపై సీపీకి ఫిర్యాదు చేసినట్లు అతడు పేర్కొన్నాడు.