
కులాస్‌పూర్‌లో దొంగల బీభత్సం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని కులాస్‌పూర్ గ్రామంలో దోపిడీ దొంగలు బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఏకంగా తాళం వేసి ఉన్న 11 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలో చోరీ జరిగిన ఇళ్లను సీపీ సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి గురువారం పరిశీలించి, బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ జడ్ సుస్మిత, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని తాళం వేసిన సుమారు 11 ఇళ్లను గురువారం ఉదయం స్థానికులు చూడగా, తాళాలు పగలగొట్టి ఉండటంతో ఒక్కొక్కరుగా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఐదారుగురి ఇళ్లల్లోనే నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్లు తెలిసింది. మిగతా వారి ఇళ్లల్లో చోరీకి యత్నించినా.. విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. ఆయా ఇళ్ల నుంచి మొత్తం 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
పిల్లులు పట్టేవారి పనేనా?
కులాస్‌పూర్‌లో గురువారం పిల్లులు పడతామని పలువురు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో సంచరించారు. ఈక్రమంలో వారే ఎవరికీ అనుమానం రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తాళం వేసిన ఇళ్లను గమనించి రెక్కి నిర్వహించి, అర్ధరాత్రి చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సుమారు అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల్లోపే నిందితులు ఒకేసారి 11 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10మందికిపైగా బృందాలుగా విడిపోయి గంటల వ్యవధిలోనే దొంగతనానికి పాల్పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మంకీ క్యాపులు ధరించి, మారణాయుధాలను కూడా వెంట తెచ్చుకున్నట్లు తెలిసింది. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ పదునైన కత్తిని మర్చిపోగా, పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలాన్ని
సీపీ సాయి చైతన్య, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, సీఐ సురేష్‌కుమార్ పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను నియమించారు. గడిచిన ఏడాది కాలంలో గ్రామంలో రెండుసార్లు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఐదారు ఇళ్లల్లో ఒకేరోజు చోరీ జరిగినా.. ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతిలేదు.
తాళం వేసిన 11ఇళ్లలో చోరీ
7.3 తులాల బంగారం, 54 తులాల
వెండి, రూ.3.85లక్షల నగదు అపహరణ

కులాస్‌పూర్‌లో దొంగల బీభత్సం