భైంసాటౌన్: జిల్లాలో పన్నులు చెల్లించకుండా కొందరు వ్యాపారులు రూ.కోట్ల విలువైన సరుకులను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జీరోలో సరుకులు తీసుకొస్తున్నారు. గతంలో తానూరు మండలంలోని బెల్‌తరోడ్ వద్ద ఆర్టీఏ చెక్‌పోస్టు ఉండేది. ప్రభుత్వం వాటిని తొలగించడంతో ప్రస్తుతం వాహనాలను తనిఖీ చేసేవారు లేరు. దీంతో జీరో దందా మరింత పెరిగింది. కొందరు వ్యాపారులు పన్నులు తప్పించుకునేందుకు జీరోలో సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే సరే, లేదంటే అంతే అన్నట్టు మారింది. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి అయిన సిమెంట్, స్టీల్‌తోపాటు నేల బొగ్గు, కిరాణా సామగ్రి, చక్కెర వంటివి భారీగా దిగుమతి అవుతున్నాయి.
నకిలీ వే బిల్లులతో బొగ్గు..
జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటికి నేలబొగ్గు అవసరం. సింగరేణి నుంచి జీఎస్టీ చెల్లించి వే బిల్లులతో తరలిస్తే రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. అయితే కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు జీఎస్టీ తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును తెచ్చుకుంటున్నారు. అక్కడి బొగ్గు బావుల నుంచి చోరీ చేసిన వాటిని ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండా జీరోలో తెస్తున్నారు. మహారాష్ట్రలోని వని, చంద్రపూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి నేలబొగ్గు లారీల్లో ఇటుక బట్టీలకు తరలుతోంది. జీఎస్టీ ఎగవేయడంతో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి పడుతోంది.
నిర్మాణ సామగ్రి కూడా..
నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంట్, స్టీల్ కూడా జీరోలో వస్తోంది. గతేడాది పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో ఓ ఐరన్ లోడ్ లారీ పట్టుబడింది. పలువురు హార్డ్‌వేర్ వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి స్టీల్, సిమెంట్ దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి ఎక్కువ మొత్తంలో ఐరన్ అక్రమంగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇలా జీరో దందా నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్నులు ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో కూడా కిరాణా, ఇతర సరుకులు తెప్పించుకుంటూ పన్నులు ఎగ్గొడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
జిల్లాలో జీఎస్టీ ఆదాయానికి గండి పడేలా అక్రమ దందాలు నడుస్తున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడం జీరో దందాకు మరింత ఊతమిస్తోంది. అక్రమంగా సరుకులు రవాణా చేసే మార్గాల్లో అధికారులు తనిఖీలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
సమాచారం ఇవ్వాలి..
బిల్లులు లేకుండా సరుకులు తరలిస్తే సమాచారం ఇవ్వాలి. జీరోలో సరుకులు దిగుమతి చేయడం, ప్రభుత్వానికి పన్ను ఎగవేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా సరుకులు దిగుమతి చేసుకుంటే పన్నుతోపాటు జరిమానా విధిస్తాం. – హన్మంత్‌రావు,
కమర్షియల్ ట్యాక్స్ అధికారి, నిర్మల్


