మన పశుగ్రాసంపై ‘మహా’ కన్ను | - | Sakshi
Sakshi News home page

మన పశుగ్రాసంపై ‘మహా’ కన్ను

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

జిల్లాలో వరి కోతలు షురూ మహారాష్ట్రకు తరలిపోతున్న ఎండు గడ్డి ప్రభుత్వమే సేకరించి నిల్వ చేయాలంటున్న పశుపోషకులు

భైంసా: జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. పశుపోషకులకు ఉపయోగపడాల్సిన పశుగ్రాసంపై మహారాష్ట్ర రైతులు కన్నేశారు. మహారాష్ట్రకు చెందిన రైతులు, వ్యాపారులు జిల్లాలోని వివిధ గ్రామాల రైతుల నుంచి ఎండుగడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. దీంతో జిల్లాలో పశుగ్రాసం నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మొదలైన తరలింపు...

వరి కోతలు పూర్తయిన రైతులు ఎండుగడ్డిని కట్టలుగా కట్టిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన రైతులు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో గడ్డి కట్టను రూ.80 నుంచి రూ.90 వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పశువుల పెంపకం లేని రైతులకు ఇది అదనపు ఆదాయంగా మారుతోంది.

ఎల్‌నినోతో మేత కొరత ముప్పు..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతోంది. పచ్చిమేత సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశువుల పెంపకంపై ఆధారపడిన రైతులు మేత లభ్యతపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఎండుగడ్డి కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతే స్థానిక పశుపోషకులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడే మేల్కోవాలి

వరి కోతలు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలోనే పశుగ్రాసం సేకరణ, నిల్వలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సీజన్‌ ముగిసిన తర్వాత గడ్డి కోసం వెతికే పరిస్థితి రాకుండా వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే జిల్లాలోని పశువుల అవసరాలకు సరిపడా ఎండుగడ్డిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే చేతికి వచ్చిన పశుగ్రాసం పొరుగు రాష్ట్రానికి తరలిపోతుంది.. వేసవిలో స్థానిక పశుపోషకులు మేత కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement