● తూము గేటులో ఇరుక్కున్న దుంగ ● వృథాగా 213 క్యూసెక్కుల నీరు
కడెం: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ తూము గేటులో పెద్ద కలప దుంగ ఇరుక్కోవడంతో గేటును పూర్తిగా మూసివేయడానికి ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి గేటు మూతపడక సుమారు 213 క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తోంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, నీటి వృథాను ఆరికట్టేందుకు గేట్ల ఎగువన మొరం, ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 691.171 అడుగులు ఉంది. మరమ్మతు పనులను మంగళవారం ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, ఏఈఈలు పర్యవేక్షించారు. బుధవారం లోగా అడ్డుకట్ట పనులు పూర్తి చేసి నీటి వృథాను ఆరికడతామని అధికారులు పేర్కొంటున్నారు.


