ట్రిపుల్‌.. ఎగ్జామ్స్‌ ట్రబుల్‌! | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌.. ఎగ్జామ్స్‌ ట్రబుల్‌!

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

ఇటీవలే నీటి ఎద్దడితో దసరా సెలవులు పొడగింపు

కళాశాలకు వచ్చిన నాలుగు రోజులకే పరీక్షలు..

విద్యార్థుల్లో ఆందోళన

భైంసా: రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరొందిన బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్టీయూకేటీ)లో విద్యార్థుల ట్రబుల్స్‌ కొనసాగుతున్నాయి. తీవ్రమైన నీటి ఎద్దడి, అధికారుల నిర్లక్ష్యం, విద్యా ప్రణాళికలో గందరగోళం కారణంగా వారి చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఓవైపు క్యాంపస్‌లోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తుండగా, సెలవుల అనంతరం విడుదలైన పరీక్షల షెడ్యూల్‌ విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

కారణాలపై స్పష్టత లేదు

నీటి సమస్యకు ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు కారణమని తొలుత వివరణ ఇచ్చిన యంత్రాంగం, తర్వాత మిషన్‌ భగీరథ నీటి సరఫరా అంశాన్ని ప్రస్తావించింది. అసలు కొరతకు ప్రధాన కారణం ఏమిటి? పంప్‌హౌస్‌ మోటార్ల మరమ్మతులు ఎందుకు ఆలస్యమయ్యాయి? రోజువారీ సరఫరా ఎంత? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి? పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది? అనే ప్రశ్నలకు సమగ్ర వివరాలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

క్యాంపస్‌లోనే పుస్తకాలు..

సెలవుల కారణంగా ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల పుస్తకాలు, చదువు సామగ్రి క్యాంపస్‌లోనే ఉండిపోయాయి. ఆన్‌లైన్‌ తరగతులు కూడా నిర్వహించకపోవడంతో చదువులకు దూరమయ్యామని పేర్కొంటున్నారు. కళాశాలకు వచ్చిన కొద్ది రోజుల్లోనే పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ముందుగా తరగతులు నిర్వహించి, పాఠ్యాంశాలు పూర్తిచేసి, పరీక్షలకు తగిన సమయం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని నిలదీస్తున్నారు.

సమాధానం లేని ప్రశ్నలు..

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీటి సమస్య, విద్యా ప్రణాళికపై యాజమాన్యం సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీటి సరఫరాలో లోపాలు ఎక్కడున్నాయి? బాధ్యులెవరు? మరమ్మతుల జాప్యానికి కారణాలేమిటి? సెలవుల సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు ఎందుకు నిర్వహించలేదు? పరీక్షల షెడ్యూల్‌ను విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు రూపొందించలేదు? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలి.

ఆన్‌లైన్‌ తరగతులూ నిర్వహించని వైనం..

వరుస పరీక్షలు..

నీటి సమస్య నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం దసరా సెలవులను పొడిగించింది. దీంతో విద్యార్థులు అక్టోబర్‌ 10 నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. క్యాంపస్‌లో విద్యా కార్యకలాపాలు నిలిచిపోగా, కనీసం ఆన్‌లైన్‌ తరగతులైనా నిర్వహించలేదు. నవంబర్‌ 16న యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఈ నెల 19 నుంచి ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కళాశాలకు తిరిగి వచ్చిన నాలుగు రోజుల్లోనే నవంబర్‌ 23, 25, 26 తేదీల్లో రెండో, మూడో నెలవారీ పరీక్షలు నిర్వహించనున్నారు. వెంటనే నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 10 వరకు సెమిస్టర్‌ థియరీ పరీక్షలు, అనంతరం ప్రయోగశాల పరీక్షలు జరగనున్నాయి. వరుస పరీక్షల మధ్య తగినంత విరామం లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement