నిర్మల్‌చైన్‌గేట్: హైదరాబాద్‌లో నవంబర్ 14న నిర్వహించిన ‘భారత్ సమ్మిట్–2026’ వేదికపై విదే శీ రాజకీయ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పార్టీ జిల్లా నాయకులతో కలిసి మంగళవారం ఎస్పీ జానకీషర్మిలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సమ్మిట్‌లో పాల్గొన్న ‘పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ ’ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ బహిరంగ వేదికపై ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్‘ అనే రాజకీయ నినాదాన్ని ప్రస్తావించడాన్ని రావుల రాంనాథ్ తప్పుబట్టారు. దేశంలో పర్యటిస్తున్న ఒక విదేశీ ప్రతినిధి దేశీయ రాజకీయ నినాదాలు చేయడంపై ఫిర్యాదులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జియాకోమో ఫిలిబెక్ ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు? కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందారా? అనే విషయాలను లోతుగా పరిశీలించాలని కోరారు. ఈ సమ్మిట్ నిర్వాహకులు, స్పాన్సర్లు, సమన్వయకర్తల పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాలం చిన్నారెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, కూన శశాంక్, రామోజీ నరేశ్, రావులవార్ విఠల్, ధర్మాజీగారి ఈశ్వర్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేశ్‌గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమ్మరి వెంకటేశ్, ఒడిసిల అర్జున్, ఎండోమెంట్స్ జిల్లా కన్వీనర్ కందుల హరీశ్ పాల్గొన్నారు.


