కోతలు జోరు.. కొనుగోళ్లు బేజారు! | - | Sakshi
Sakshi News home page

కోతలు జోరు.. కొనుగోళ్లు బేజారు!

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

● జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు ● ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ● ఆందోళన చెందుతున్న రైతన్నలు

ఈ రైతు పేరు కందకుర్తి గంగరాజు. లోకేశ్వరం మండలం ధర్మోర గ్రామంలో తనకున్న ఎనిమిది ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు. ఐదెకరాల్లో ఇటీవల పంట కోశాడు. పది ట్రాక్టర్ల ధాన్యం పంచగుడి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. 15 రోజులుగా ధాన్యం అరబెడుతున్నాడు. ప్రభుత్వం ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో మూడెకరాల్లో వరిపంట కోతకు వచ్చినా కోయడం లేదు. త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని గంగరాజు డిమాండ్‌ చేస్తున్నాడు.

లోకేశ్వరం: జిల్లాలో వానాకాలంలో రైతులు సుమారు 1.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి పెరుగుతుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 1,43,000 మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం రావచ్చని భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 356 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కొన్ని మండలాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు 70 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు.

కోతలు ఊపందుకున్నా..

జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. అబ్దుల్లాపూర్‌, కన్కపూర్‌, లోకేశ్వరం, ధర్మూర్‌, పంచగుడి, పిప్రి, గడ్‌చాంద్‌, రాజూర్‌ తదితర గ్రామాల్లోని రైతులు 15 రోజుల నుంచి ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి ఎదురు చూస్తున్నారు. కానీ కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని కేంద్రాలు ప్రారంభమై 25 రోజులు గడిచినా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవే టు వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు. కొనుగోళ్లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

అన్నదాత ఆవేదన

‘పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తాం’ అని ప్రకటించే పాలకులు, అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో ఎందుకు మౌనంగా ఉన్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కోతలు ప్రారంభమైనా పంటను ఇళ్లలో లేదా పొలాల్లో నిల్వ చేయలేక తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.

జిల్లాలో వరి కొనుగోలు కేంద్రా వివరాలు..

జిల్లాలో వరి వానాకాలంలో వరి సాగు ..1లక్ష37 వేల ఎకరాల్లో

వానాకాలంలో వరి ధాన్యం టార్గెట్‌ 1లక్ష43వేల 65 మెట్రిక్‌టన్నులు

గత ఏడాదిలో రైతు నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం..1.14 లక్షల మెట్రిక్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement